గోళ్లు విరగటం ఆపటానికి .... సింపుల్ సొల్యూషన్

updated: March 16, 2018 21:56 IST

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకురాకు అని మనవాళ్లు అంటూంటారు. కానీ నిజానికి గోళ్ల సమస్యలు కూడా అలాంటివే. గోళ్లే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి తర్వాత మనకు పెద్ద సమస్యలా   తయారు అవుతాయి. అతి శుభ్రత కోసం ఎక్కువ సమయం డిటర్జెంట్‌ సబ్బులతో బట్టలు ఉతకడం, నీటిలో ఎక్కువగా గోళ్లు నానడం, కడిగిన గిన్నెలనే పదే పదే కడగటం చేసే స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువగా వస్తూంటాయి. అలాంటి సమస్యల్లో ఒకటి గోళ్లు పెళుసుబారి విరిగిపోవటం. 

అసలు గోళ్లు ఎందుకు విరిగిపోతాయి అంటే.. వాటికు తేమ సరిగ్గా అందకపోవడం వల్ల అవి సులువుగా విరిగిపోతాయి. ఈ సమస్యకు బాదం నూనె చక్కని పరిష్కారం ఇస్తుంది. రోజులో ఒక్కసారైనా బాదం నూనెతో మర్దనా చేయడం వల్ల గోళ్లు మృదువుగా, ఆరోగ్యంగా మారతాయి. లేదూ,మాకు బాదం నూనే అందుబాటులో లేదూ అంటే.. గోరువెచ్చని కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి వాడినా ఫలితం బావుంటుంది.

ఇక ఈ గోళ్లు విరిగిపోవటానికి కారణం .. విటమిన్‌-ఇ లోపం. ఒకసారి వైద్యులను సంప్రదించి విటమిన్‌-ఇ మాత్రల్ని తీసుకోవటమో లేకపోతే   విటమిన్‌-ఇ నూనెను తరచూ రాసుకోవడం వల్ల కూడా గోళ్లు బలంగా మారతాయి.

ఇవన్నీ చేయలేం అంటారా..ఇంకా సింపుల్ మార్గం..చక్కగా ..కాచి చల్లార్చిన గ్రీన్‌టీలో కాసేపు వేళ్లు ఉంచి ఆ తరువాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల  పసుపు పచ్చగా మారిన గోళ్లు మామూలు రంగులోకి మారి తాజాగా కనిపిస్తాయి. ఎందుకంటే గ్రీన్‌టీలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. 

మరో సులభ మార్గం... కాస్త టొమాటో గుజ్జు తీసుకుని ఒక పదినిమిషాలు అందులో వేళ్లు ఉంచి ఆ తరువాత కడిగేసినా ఫలితం ఉంటుంది.

comments